లేఖనం చిరం, స్ఠిరం. అది ప్రాచీనం, ఐనా ఎప్పటికప్పుడు నవీనం. ఎందుకంటే అది పలుకరింపు కనుక. దేవ పలుకరింపుకు కాలపరిమితులుండవు. లేఖనం ప్రతి తరాన్నీ పలుకరిస్తుంది, ప్రతి వ్యక్తినీ సంధిస్తుంది. ఐతే పలుకరింపును గ్రహించాలన్నా, ప్రతిస్పందించాలన్నా వ్యక్తీకృత భావం యొక్క పూర్వాపరాలకు సంబంధించిన స్పృహ, అవగాహన ఆవశ్యకమౌతుంది.
లేఖన విశ్లేషణలో భావం, పదం రెండూ ప్రధానమైనవే. అందుకే అధ్యయనం భావదర్శనాన్ని, పదదర్శనాన్ని రెండింటినీ ప్రామాణికంగా పరిగణిస్తుంది.
ఒక పూర్వ సంఘటనను విశ్లేషించుకోవాల్సి వచ్చినప్పుడు ఆ కాలానికి సంబంధించిన సామాజిక, ఆర్ధిక,సాంస్కృతిక, రాజకీయ, ఆస్తిక పరిస్థితులలోనికి తప్పక తొంగిచూడాల్సి ఉంటుంది. అధ్యయనం అందుకు దోహదపడుతుంది. ఈ సూత్రాన్ని ప్రామాణికంగా పాటిస్తున్నందునే ఆచార్యులవారి అధ్యయనం అనతికాలంలోనె అనేకుల మస్తిష్కాలలో జిజ్ఙాసను జ్వలింపజేసింది. తత్ సత్ఫలితమే నేటి అధ్యన కుటుంబ ఆవిర్భావం.
ఇవేళ మా అధ్యయన కుటుంబంలో ఎనభయ్ మందికి పైగా ప్రత్యక్ష సభ్యులున్నారు. ఇంకెందరో పరోక్ష సభ్యులుగా ఉన్నారు. వీరిలో సంఘ కాపరులు, సౌవార్తికులు, దేవజ్ఙాన అధ్యయన విద్యార్ధులు, ఉద్యోగులు, అధ్యాపకులతో పాటు అంతర్ విశ్వాస ప్రతినిధులు సైతం ఆసక్తి కలిగి ఉండటం దైవానుగ్రహం. ఆచార్యుల అధ్యయన దర్శనాన్ని సమిష్ఠిగా ప్రదర్శించేందుకు నిబద్ధత కలిగుండటం ఈ కుటుంబ సభ్యుల విశిష్ట లక్షణం.
