
అనంతాన్ని పరిమితం ఎలా అవగాహన చేసికోగల్గుతుంది? సుగుణమైన, దుర్గుణమైన నిర్గుణాన్ని ఎలా గ్రహించగల్గుతుంది? ఈ భావనల్ని వివిధ దృక్పథాల్లోంచి అవగహన చేసికోటానికి ప్రయత్నిద్దాం.
భావాన్ని వ్యక్తీకరించడానికి, అలాగే దానిని గ్రహించడానికి ప్రధానంగా కావాల్సింది భాష. కనుక మొదట ఈ రెండు పదాలకు సంబంధించిన భాషా వివరణను మొదట తెలుసుకుందాం.

- అనంతం (Anantam
“అన్” (నః), అంటే “లేదు” అని అర్థం.
“అంతం” అంటే “ముగింపు”, అని అర్థం.
ఈ రెండింటి సంయోగం “అనంతం”. అంటే “ముగింపు లేనిది”.
శాశ్వతం, నిత్యం, అపరిమితం, అమితం, అక్షయం. ఇవి దీని పర్యాయ పదాలు.
పరిమితం, అవధి, సీమితం, అంతం, ముగింపు. ఇవి వ్యతిరేక పదాలు.

- పరిమితం (Parimitam)
“పరి” అంటే “చుట్టూ” అని అర్థం.
“మితం” అంటే “పరిమాణం” అని అర్థం.
అవధి, హద్దు, నియమితం, అల్పం, మోతాదు. ఇవి దీని పర్యాయ పదాలు.
అనంతం, అపరిమితం, అమేయం, అసీమం. ఇవి వ్యతిరేక పదాలు.
ఇప్పుడు ఈ పదాల్ని లేదా భావనల్ని తాత్వికత (Philosophy)లోంచి, ఆస్తికత (Theology)లోంచి అవలోకిద్దాం.

తత్వశాస్త్రంలో జ్ఞాన సిద్ధాంతం (Epistemology) అనేది ఒక ప్రధాన శాఖ. ఇది “జ్ఞానం యొక్క స్వభావాన్ని, మూలాల్ని ఇంకా దాని పరిమితుల్ని” గురించి అధ్యయనం చేస్తుంది.
జ్ఞాన సూత్రం, ప్రధానంగా ఈ క్రింది ప్రశ్నలకు జవాబులను అన్వేషిస్తుంది:
- జ్ఞానమంటే ఏంటి?
- మనకు జ్ఞానమెలా లభిస్తుంది?
- మనం దేన్ని నిజమని నమ్మొచ్చు?
- జ్ఞానానికున్న పరిమితులేంటి?
ఈ ప్రశ్నలు అనంత పరిమితాల అన్వేషణకు ఆలంబనగా నిలుస్తాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే, ఎపిస్టెమాలజీ అనేది “మనకు తెలుసు అనే విషయాన్ని మనమెలా తెలిసికోగలం?” అనే ప్రశ్నకు సంబంధించిన అధ్యయనం.

పరిమిత మనస్సు తన అనుభవాల ఆధారంగా మాత్రమే విషయాలను గ్రహిస్తుంది. కానీ అనంతమనేది పరిమిత అనుభవాలకతీతమైన భావన. కాబట్టి తాత్వికంగా ఆలోచించినప్పుడు పరిమితుడు అనంతాన్ని సంపూర్ణంగా గ్రహించలేడు; అతడు కేవలం ఉపమానాలు లేదా సాదృశ్యాల ద్వారా (Analogy), ప్రతీకలు లేదా చిహ్నాల ద్వారా (Symbol), నిరాకరణ లేదా తిరస్కరణ ద్వారా (Negation) మాత్రమే దాన్ని సమీపించగలుగుతాడు.
మాటవరుసకు చెప్పాలంటే, “అనంతం” అనేది ముగింపులేని ఒక సంఖ్యల వరుసను ఊహించడం లాంటిది.
ఇప్పుడు అనంతాన్ని గురించి ఇద్దరు ప్రముఖ తాత్వికుల అభిప్రాయాలను ఇక్కడ ఉటంకించుకొందాం.

ఇమ్మాన్యుల్ కాంట్ (Kant) ఇలా అంటాడు:
మానవుడు తన బుద్ధితో అనంతాన్ని నేరుగా చూడలేడు, కానీ “అవధులు లేని” దాని లక్షణాన్ని తన మనసులోని అంతర్గత భావనల ద్వారా ఊహించగల్గుతాడు..

హెగెల్ (Hegel) ఏమంటాడంటే..
మానవుడు తనచుట్టూ ఉన్న పరిమితులన్నిటినీ తన మనసులో అధిగమించే ప్రయత్నంలో అతనిలో ఏర్పడే భావమే అనంతం. అలా చూచినప్పుడు పరిమితుడికి అనంతం అర్థం అవుతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే పరిమితుడి మనసులోనే “అపరిమితాన్ని గురించిన ప్రాథమిక ఆలోచన” నిక్షిప్తమై ఉంది గనుక.

యూద-క్రైస్తవ దృక్కోణం:
బైబిల్లో దేవుడు “అనంతుడు”, మనిషి “పరిమితుడు”. అందువలన పరిమితుడు దేవుని సంపూర్ణంగా గ్రహించలేడు; కానీ, దేవుడు ప్రత్యక్షత (revelation) ద్వారా మానవునికి తనను ఎరుకపర్చు కొన్నప్ఫుడు, మానవుడు తన పరిమితిలోనుంచే ఆయన మహిమలోని కొంత భాగాన్ని గ్రహించగల్గుతాడు.
1 కొరింథీయులకు 13 : 12
ఇప్పుడు అద్దంలో చూస్తునట్టుగా సూచనగా చూస్తున్నాం; అప్పుడు నేరుగా చూస్తాం..

తాత్విక దృక్పథంలో గుణాల పరిధి:
“సుగుణం” (virtue), “దుర్గుణం” (vice) అనేవి మానవుని అనుభవంలో కనిపించే నైతిక లక్షణాలు. ఐతే ఇవి ఆయా మానవ సముదాయాలు ఏర్పర్చుకున్న సామాజిక సంప్రదాయాలకు, వారి ప్రమాణిక నైతిక సూత్రాల కనుగుణంగా నిర్వచించబడతాయి.
ఇక “నిర్గుణ”మనేది గుణాలక్షణాల కతీతమైన స్థితి. ఒక్కమాటలో చెప్పాలంటే, ఏ గుణాన్నీ స్వీకరించని, నిర్లిప్త స్తితి..

ప్లేటో – “ఆదర్శ రూపాలు” (Forms):
సుగుణం మరియు దుర్గుణం అనేవి “మంచితనం” అనే ఒక పరమ రూపానికి నీడలు. మనిషి ఆ రూపాన్ని ధర్మ బుద్ధి ద్వారా మాత్రమే తెలుసుకోగలడు.
నిర్గుణం అంటే ఆ రూపాల సమస్త లక్షణాలకతీతమైన ఒక సత్యం—ఇది బుద్ధి చేరలేని స్థితి.

క్రైస్తవంలో:
దేవుడు “పవిత్రుడు” (Holy), కాబట్టి సుగుణం ఆయన స్వభావం. అలాగే పాపంతో సంబంధపడిన ప్రతిదీ దుర్గుణం, అది దేవునికి విరోధం.
ఇక “నిర్గుణ” భావన క్రైస్తవంలో నేరుగా కనిపించదు; కానీ దేవుడు గుణాతీతుడు (beyond human qualities) అనే భావం—యెషయా 55:8–9 ప్రకారమే కొంత పోలిక ఉంటుంది.
తాత్త్విక సమ్మేళనం
పరిమితుడు అనంతాన్ని ప్రత్యక్షంగా కాకుండా ఉపమానాల ద్వారా, తర్కం ద్వారా, ధ్యానం ద్వారా గ్రహిస్తాడు.
సుగుణ, దుర్గుణాలనేవి మానవ అనుభవ స్థాయిలో కనిపిస్తాయి; నిర్గుణం అనేది గుణ-ద్వంద్వానికి అతీత స్థితి.
ఆస్తికతలో → పరిమితుడు అనంతుని గ్రహించడానికి ప్రత్యక్షత (Revelation) అవసరమౌతుంది.
తాత్వికతలో → పరిమితుడి లోపలే అనంతపు ప్రతిబింబం ఉంటుంది; అదే అతన్ని పరమాన్వేషణ వైపుకు నడిపిస్తుంది.
ఆచార్య పి.బి. రవిప్రసాద్..

అనంతం అపరిమితం, సుగుణం దుర్గుణం గురించిన చక్కని విశ్లేషణ అందించారు, ధన్యవాదములు ఆచార్య.
అయ్యగారు వందనాలు.
హెగెల్ భావన ద్వారా అనంతం అర్థం చేసుకోవచ్చు.
చాలా బాగుంది అయ్యగారు.
అనంతం పరిమితం, సుగుణం దుర్గుణం గురించిన చక్కని విశ్లేషణ అందించారు, ధన్యవాదములు ఆచార్య.
పరిమితుని మనసు భావమే అపరిమితుని అర్థం చేసుకోవటం అయితే …
సుగుణ దుర్గుణ జ్ఞానం కూడా అపరిమితమేగా…
అపరిమితుని ప్రత్యక్షతే పరిమితునికి ఆధారం…
అనంతమైన అపరిమితునికి 🙏
ఆచార్యులకు అభివాదం 🙏
మరనాత అయ్యగారు
మీరు వెబ్ సైట్ కొరకు చాలా ప్రయాస పడ్డారని వెబ్ సైట్ చూస్తే తెలుస్తుంది వెబ్ సైట్ చాలా బాగుందండి ప్రొఫెషనల్ గా ఉంది పరిమితమైన పరికరాలతో అద్బుతం సృష్టించారు మరనాత అయ్యగారు
మరనాత నాయనా.