ఇవేళ మనోవిజ్ఞాన శాస్త్రం (Psychology) ఆధారంగా కృప (Grace), సత్యం (Truth), సంపూర్ణత (Fullness) అనే భావనల్ని పరిశీలిద్దాం. ముఖ్యంగా సిగ్మండ్ ఫ్రాయిడ్ అలాగే కార్ల్ జంగ్ దృక్పథాల్లోంచి..
1) సిగ్మండ్ ఫ్రాయిడ్ (Sigmund Freud):-
మనోవిజ్ఞాన శాస్త్రంలో సిగ్మండ్ ఫ్రాయిడ్, మానవ మనస్సు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడానికి వీలుగా, ఇద్(Id), ఇగో(Ego), సూపర్ ఇగో(Superego) అనే మూడు ముఖ్యమైన నిర్మాణాలను ప్రతిపాదించాడు. ఈ భావనలను (Id, Ego, Superego) కొంత స్పష్టతతో పరిశీలిద్దాం.
1. Id (ఇద్):-
ఇది మన లోపల ఉండే అవగాహనలేని కోరికలు ఇంకా వాంఛలకు సంబంధించిన ప్రాధమిక ప్రదేశం.
ఆకలి, దాహం, లైంగిక వాంఛ, కోపం వంటి సహజ వాంఛలు ఇక్కడ్నుంచే ఉద్భవిస్తాయి.
ఇది వాంఛా సూత్రం (“Pleasure Principle”), ఆధారంగా నడుస్తుంది. తక్షణ సుఖాన్ని, సంతృప్తిని కోరుకుంటుంది.
2. Ego (ఇగో):-
ఇది “ఇద్”(Id)లో ఉద్భవించే వాంఛల్ని, వాస్తవ ప్రపంచ పరిమితులతో సమన్వయం చేసే తార్కిక భాగం.
ఇది వాస్తవ సూత్రం (“Reality Principle”), ఆధారంగా పనిచేస్తుంది.
ఒక వాంఛను తీర్చుకోవడం సరైనదా, కాదా? సమాజం, పరిస్థితులు అందుకు అనుమతిస్తాయా, లేదా? అనే విషయాన్ని తులనాత్మకంగా నిర్ణయిస్తుంది.
3. Superego (సూపర్ ఇగో)
ఇది మన నైతిక, ధార్మిక విలువల ప్రతినిధి.
తల్లిదండ్రులు, సమాజం, మతం నేర్పిన నియమాలు, నైతిక బోధలు ఇందులో ఉంటాయి.
మన ప్రవర్తన సరిగా ఉందా లేదా అనే విషయాన్ని వివేచన చేస్తుంది.
ఎక్కువగా కఠినమైన తీర్పులిస్తుంది. తప్పు జరిగినప్పుడు అవగాహనలో ఆత్మన్యూనతా భావాన్ని, అపరాధ భావాన్ని కలిగిస్తుంది.
ఇప్పుడు “కృప, సత్యం, సంపూర్ణత” అనే ఆధ్యాత్మిక అంశాన్ని గ్రహించే సందర్భంలో వీటి ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం.
Id: ఈ భావాలను తమ దృష్టిలోంచే అర్థం చేసుకోవాలనుకుంటాయి. ఉదాహరణకు: “కృప అనేది తనకు తక్షణ సుఖాన్ని, రక్షణను ఇచ్చేది” అనే కోణంలో మాత్రమే అర్థం చేసుకుంటుంది.
Ego: వాస్తవిక దృష్టితో చూసి ఈ భావనల్ని జీవిత అనుభవాలతో పోల్చి తార్కికంగా గ్రహిస్తుంది. “కృప అంటే కష్టాల్లో సహాయమని, సత్యం అంటే నమ్మదగిన ప్రమాణం” అని వివరిస్తుంది.
Superego: ఈ భావనల్ని ఉన్నతమైన ధార్మిక నైతిక ప్రమాణాలతో అనుసంధానం చేస్తుంది. “కృప అంటే నిస్వార్థమైన దేవుని అనుగ్రహమని, సత్యం అంటే నైతిక ధర్మమని, సంపూర్ణత అంటే ఆధ్యాత్మిక పరిపక్వత” అని నిర్వచిస్తుంది.
అలా ఫ్రాయిడ్ యొక్క మూడు మనో నిర్మాణాలు మనిషి ఒక సత్యాన్ని ఎలా గ్రహిస్తాడో వివరిస్తాయి:
Id → మానవ సహజ వాంఛలు (ప్రకృత స్థాయి)
Ego → వాస్తవ అన్వయం (ప్రయోగ స్థాయి)
Superego → నైతిక / ఆధ్యాత్మిక ప్రమాణం (ధర్మ స్థాయి)
వీటిని యోహాను 1:14లోని “కృప, సత్యం, సంపూర్ణత”లతో పోలిస్తే:
“కృప”:
ఫ్రాయిడ్ నేరుగా “కృప” (grace) అనే పదాన్ని ఉపయోగించలేదు, ఎందుకంటే ఆయన ప్రతిదాన్నీ నాస్తిక దృక్పథంతోనే విశ్లేషించాడు.
ఐతే మనోవిజ్ఞాన కోణంలోంచి, “కృప”ను మనిషి తన స్వభావాన్ని, దోషాల్ని అంగీకరించి, తనలోని అవచేతన (Unconscious) శక్తుల్ని వెలికితీసుకోవడం ద్వారా వచ్చే స్వేచ్ఛగా పేర్కొంటాడు. అలాగే Id కోరిన వాంఛలకు సమాధానం ఇచ్చే దైవ అనుగ్రహం, కానీ Ego, Superego ద్వారా అది ఆధ్యాత్మిక రూపం పొందుతుంది. ఐతే దీన్ని ధార్మిక కృపగా కాకుండా మానసిక విముక్తిగా పరిగణిస్తాడు.
“సత్యం”:
ఫ్రాయిడ్ దృష్టిలో సత్యం అంటే, మానవ ప్రవర్తన వెనుక అంతర్లీనంగా ఉన్న అవచేతన (Unconscious) శక్తుల్ని వెలికితీయడమే.
ఒక మనిషి తనలోని “నేను” (ego) అనే తత్వం నిజంగా ఎంత స్వేచ్ఛగా ఉందో తెలుసుకోవడం.
అతని మాటల్లోనే చెప్పాలంటే, “Where id was, ego shall be” అంటే నిజమైన స్వభావం, మనసు లోతుల్లో ఉన్న దాచిన శక్తులను అంగీకరించడమే.
ఇగో (Ego) వాస్తవాన్ని తార్కికంగా అంగీకరిస్తుంది, ఐతే సూపర్ ఇగో (Superego) దాన్ని నైతిక ప్రమాణాలతో స్థిరపరుస్తుంది.
“సంపూర్ణత”:
ఫ్రాయిడ్ దృష్టిలో సంపూర్ణత (Fullness) అనేది మానవ మనసులో id, ego, superego ల మధ్య ఉండే సమతుల్యత.
ఈ మూడు శక్తుల మధ్య ఉండే సర్దుబాటు స్థితిని ఆయన మానసిక ఆరోగ్యంగా అభివర్ణిస్తాడు.
అంతర్గత వైరుధ్యాలను అధిగమించి, వాస్తవాన్ని అంగీకరించే స్థితిని సంపూర్ణత అంటాడు.
Id–Ego–Superego ల సమన్వయం ద్వారా మనిషి దైవ సన్నిధిలో పరిపూర్ణత పొందడమే సంపూర్ణత.
ఆచార్య పి.బి. రవిప్రసాద్..

చాలా బాగా అర్ధవంతంగా ఉంది అయ్యగారు 🙏😇
Blessings ra bidda
ధన్యవాదాలు ఆచార్య
Thank you so much Uncle 🙏