Anveshana

“అన్వేషణ” లేదా “వెతుకులాట” అనేది మానవ అస్తిత్వంలో ఇమిడి ఉన్న ఒక సహజ స్వభావం. ఇది ఒక లోతైన ఆంతరంగిక భావన (ఎందుకు?), అలాగే ఒక క్రియాత్మక బాహ్య ప్రక్రియ (ఎలా?) అనే ఈ రెండింటి సమగ్ర అనుభవం. ఇది మనల్ని అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకు, సంక్లిష్టత నుండి సరళత వైపుకు, ప్రశ్నల నుండి సమాధానాల వైపుకు నడిపించే నిరంతర మానవీయ ప్రయాణం. ఇది కేవలం జీవనాన్ని వెతకడం కాదు, జీవితార్థాన్ని వెతక్కోవడం.

అన్వేషణకు మూల కారణం “అవసరం”. అది భౌతికం కావొచ్చు, భావోద్వేగం కావొచ్చు, పారమార్థికం కావొచ్చు మరేదైనా కావొచ్చు. మానవ జీవితానికి తొలి నిర్దేశిక సూత్రం మాత్రం అవసరమే. అసలు అవసరమనేదే లేకపోతే అన్వేషణకు అర్థమే ఉండదు. అవసరం అన్వేషణకు దారితీస్తుంది. అన్వేషణ అవకాశాలను సృష్టించుకొంటుంది. అవకాశాలు ప్రణాళికలను రచిస్తాయి. ప్రణాళికలు కార్యాచరణకు పురికొల్పుతాయి. ప్రయత్నాల కనుగుణంగా ఫలితం ఉంటుంది.
అందుకే, అధ్యయనంలో భాగంగా నేనందిస్తున్న ఈ “అన్వేషణ” వ్యాస పరంపరను “అవసరం”తోనే ఆరంభిస్తున్నాను.

 

మొదట “అవసరం” అనే పదాన్ని లేదా భావనను భాషాపరంగా, శాస్త్రీయంగా, తార్కికంగా, తాత్వికంగా, దేవజ్జాన పరంగా, మనోవిజ్ఞాన పరంగా; ఇలా విశ్లేషణాత్మకంగా వివరించుకుందాం.

  1. భాషాపరమైన విశ్లేషణ (Linguistic Analysis):
    “ఆవసరం” అనే మాటకు తెలుగులో “అవసరం”, “ఆవశ్యకత” లేదా “కావలసినది” అని అర్థం. ఇది సంస్కృత భాషలోని “అవసర” (avasara) అనే పదం నుండి ఉద్భవించింది, దీనికి “సమయం”, “అవకాశం”, “క్షణం” లేదా “సందర్భం” అనే అర్థాలున్నాయి. ఇక్కడ “ava” అంటే “క్రిందికి” లేదా “దిగువకు”, “sr̥” అంటే “ప్రవహించు”, “ac” అనే పదవిశేషణ (Suffix)కు పూర్తిగా “పడిపోవడం” లేదా “సమయం వచ్చినప్పుడు” అనే భావనను సూచిస్తుంది.
  1. శాస్త్రీయ వివరణ (Scientific Analysis): శాస్త్రపరంగా చూచినప్పుడు “అవసరం” జీవశాస్త్రంతోనూ, అలాగే మనోవిజ్ఞానశాస్త్రంతోనూ గాఢంగా ముడిపడి ఉంటుంది.
    ఇది శరీరంలోని అంతర్గత సమతుల్యతను (హోమియోస్టాసిస్ – Homeostasis)ను నిర్వహించడంతో సంబంధపడి ఉంది. శరీరంలో నీరు, నిద్ర, ఆహారం లాంటివి లోపించినపుడు అది ఒక శారీరక అవసరంగా తనను తాను ప్రకటించు కుంటుంది. ఈ అవసరం తీరకపోతే, జీవి బలహీనపడి, అనారోగ్యానికి గురై చివరకు చనిపోతాడు.
  1. మనోవిజ్ఞాన శాస్త్రంలో (Psychological): అబ్రాహం మస్లో (Abraham Maslow) అనే శాస్త్రవేత్త తాను ప్రతిపాదించిన “అవసరాల సిద్ధాంతాన్ని” (Hierarchy of Needs) పంచసోపాన క్రమంలో ఒక పిరమిడ్ ఆకారంలో రూపొందించాడు: దాని ప్రకారం:-
  2. మనం పైన చెప్పుకొన్న ఆహారం, నీరు, నిద్ర, ఆహారం, శ్వాస వంటి భౌతిక అక్కరలు (Physiological Needs), అత్యంత ప్రాథమికమైన అవసరాలు..
  3. రక్షణ, ఉపాధి, ఆర్థిక స్వావలంబన, ఆరోగ్యం తదితరమైనవి భద్రతా పరమైన (Safety Needs) అవసరాలు..
  4. ఇక, ప్రేమ, కుటుంబం, స్నేహం, సామాజిక సమ్మతి – ఇవి సామాజిక పరమైన (Love/Being) అవసరాలు.
  5. అలాగే స్వీయ-గౌరవం, ఇతరుల గౌరవం, విజయం, గుర్తింపు లాంటివి గౌరవాభిమానాలకు (Esteem) సంబంధించిన అవసరాలు.
  6. చివరిగా, సృజనాత్మకత, ఆత్మ స్వచ్ఛత, జీవన సాఫల్యత వంటివి స్వీయ-వాస్తవీకరణకు (Self-actualization) సంబంధించిన అవసరాలు. ఈ సిద్ధాంతం ప్రకారం, వ్యక్తి ప్రాథమికమైన తన భౌతిక అవసరాలు తీరిన తర్వాతే, ఇతర అవసరాల కోసం ప్రయత్నిస్తాడు.
  1. తార్కిక విశ్లేషణ (Logical Analysis):
    తర్కశాస్త్రంలో అవసరమనేది ఒక పరస్పర ఆధారిత పరిస్థితి (Condition)ని సూచిస్తుంది.
    మాటవరుసకు, పంటలు పండించటానికి నీళ్ళు కావాలి. ఇదొక తార్కిక నియమం. నీళ్ళు లేకుండా పంటలు పండించడం సాధ్యపడదు.
    ఐతే ఈ నియమానికి సంబంధించిన మరో తార్కిక సూత్రం కూడా ఉంది. అదే, ౠతప్పనిసరి పరిస్థితి, చాలినంత స్థితి (Necessity and Sufficiency) మళ్ళీ ఈ రెంటి మధ్య తేడా ఉంటుంది.
    ఎలాగంటే, జీవించడానికి ఆక్సిజన్ అవసరం. కానీ ఆక్సిజన్ మాత్రమే జీవించడానికి తప్పనిసరి కాదు, ఆహారం కూడా కావాలి.
  1. తాత్విక విశ్లేషణ (Philosophical Analysis):
    తత్వశాస్త్రంలో, అవసరమనేది మానవ అస్తిత్వంతో పాటు స్వేచ్ఛతో కూడా ముడిపడి ఉంటుంది.
    కార్ల్ మార్క్స్ అవసరాలను తీర్చుకోవడం కోసం సాగించిన పోరాటంగా మానవ చరిత్రను అభివర్ణిస్తాడు. భౌతిక, ఆర్థిక, సామాజిక అవసరాలు రాజకీయాలకు రూపకల్పన చేశాయి. ఐతే దురదృష్టవశాత్తు దాన్నే మనం చరిత్రగా పరిగణిస్తాం. కానీ “భౌతిక జీవన విధానం నుండే అసలైన చరిత్ర ప్రారంబమౌతుందని” ఆయన ప్రతిపాదించాడు.

ఇక అస్తిత్వవాదం (Existentialism)లో, జీన్ పాల్ సార్త్రే వంటి తత్వవేత్తలు, మానవుడు తన అవసరాలను తీర్చుకోవడం ద్వారానే, తన జీవిత పరమార్థాన్ని నిర్ణయించుకుంటాడని వాదిస్తాడు. మన అవసరాలు, వాటిని తీర్చుకొనే క్రమంలో మనం ఎంచుకొనే విధానాలు ఇవే కర్తవ్యాలను నిర్వచిస్తాయి. మనం ఏమి కోరుకుంటామో అనే దాని మీద కాకుండా, మనకేది అవసరమో అనే దాని మీదే మన అస్థిత్వం ఆధారపడి ఉంటుంది.

  1. దేవజ్ఞాన విశ్లేషణ (Theological Analysis):
    దేవశాస్త్రంలో, అవసరమనేది దేవునికి, మానవునికి మధ్య ఉన్నసంబంధాన్ని నిర్వచిస్తుంది.
    భక్తి భావనలో, భక్తుడికి దేవుడి మీద ఉండే నమ్మకం అతడు దేవుని మీద ఆధారపడటాన్ని ఒక అవసరంగా మారుస్తుంది. “దేవుడే దిక్కు” అనే భావనే ఇందుకు నిదర్శనం. ఇక్కడ ఆధ్యాత్మిక శాంతి, అలాగే మోక్షం అనేవి కేవలం అంతిమ అవసరాలుగా మాత్రమే పరిగణించ బడతాయి.
    ఇక సృష్టి సిద్ధాంతంలో దేవుడు సర్వసమృద్ధుడు, ఆయనకు ఎలాంటి అవసరమూ ఉండదు. కానీ సృష్టిలో అంతర్భాగమైన మానవుడు, తన అస్తిత్వం కోసం, ఆధ్యాత్మికత కోసం దేవుడిపై ఆధారపడతాడు. దానికోసం భక్తిని, ప్రార్థనను, అర్పణను ఆధార అవసరతలుగా మలుచుకొంటాడు.
    కర్మ సిద్ధాంతంలోనైతే, వ్యక్తి ప్రస్తుత అవసరాలు అతని పూర్వ జన్మల కర్మపై ఆధారపడి ఉంటాయని చెప్పబడింది.
  1. మనోవిజ్ఞాన విశ్లేషణ (Psychoanalytical Analysis):
    సిగ్మండ్ ఫ్రాయిడ్, మానవని అవచేతనలో (Unconscious) ఉండే వాంఛలు, ప్రేరణల అధారంగా అవసరాలు రూపొందించబడతాయి అంటాడు. ప్రాథమికంగా లైంగిక వాంఛ (Libido), అలాగే మరణాపేక్ష (Thanatos)లు మనిషి అవసరాలను, చర్యలను నియంత్రిస్తాయి. ఇవి అవ్యక్త అవసరాలుగా అవచేతనంలో ఉండి స్వప్నాల రూపంలో, అసంకల్పిత తప్పిదాల
    (Slip of the tongue) రూపంలో వ్యక్తమౌతుంటాయి.

సంగ్రహ వివరణ (Synthesis):

“అవసరం” ఒక బహూముఖ భావన.
భాషా పరంగా ఇదొక ఆవశ్యకత.
భౌతిక శాస్త్రంలో జీవించడానికి అత్యంత అవసరమైన ఒక షరతు.
తర్కంలో తప్పనిసరైన నియమం.
తత్వశాస్త్రంలో మానవ చరిత్రకు, స్వేచ్ఛకు అన్వయించబడిన కారణం.
దేవజ్ఞానంలో దేవుడి మీద ఆధారపడటం ఇంకా మోక్షాన్ని ఆకాంక్షించడం..
మనోవిజ్ఞానంలో ప్రవర్తనను నిర్దేశించేదే కాక, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడేది కూడా .

ఈ అన్ని దృక్పథాలు “అవసరం”ని మానవ అనుభవానికి మూల కేంద్రంగా, మన చర్యల్ని, ఆలోచనల్ని, సమాజిక సంబంధాల్ని ఇంకా నమ్మకాల్ని రూపొందించే ఒక బలీయమైన శక్తిగా పేర్కొంటాయి. “అవసరం” లోపం లేదా బలహీనత కాదు. అది జీవన ప్రక్రియలోని ఒక అంతర్గత మూలాధారం.

ఆచార్య పి.బి. రవిప్రసాద్..

17 thoughts on “Anveshana”

  1. Ramesh David Nittala

    అన్వేషణ = జీవనాన్ని వెతుక్కోవడం కాదు జీవితార్ధాన్ని వెతుక్కోవడం.

    అవసరం గురించి 6 విధాల విశ్లేషణ
    చాలా ఉపయోగకరముగా ఉంది అయ్యగారు.

  2. Johnson kodavati

    “అవసరం” గురించి చాలా లోతుగా మరియు అద్భుతంగా వివరించారు ఆచార్య గారు

  3. అయ్యగారు, అవసరత యొక్క అవశ్యకత మరియు దాని వెనుక ఉన్న ఆర్ద్రతను కేవలం అంతరంగ మధనం ద్వారా అందించుటలో మీ కృషి శ్లాఘనీయం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top